ఈ పుస్తకమునందు శుక్ల యజుర్వేదమునందలి 40వ అధ్యాయమును, ప్రతిపదార్థ సహితముగా, సరళమైన వివరణలతో అందించు ప్రయత్నము చేయుచున్నాను. ఈ అధ్యాయమును “ఈశావాస్య బ్రాహ్మణ్యము” అని అంటారు. కొందరు ఈ అధ్యాయమునే వాజసనేయ సంహిత అని కూడా అంటారు. ఈ అధ్యాయమునందు మొత్తము 17 శ్లోకములు కలవు. ఇందులోని శ్లోకములు ఈశ్వరుని గూర్చి, ఆయన యొక్క యశస్కరమైన నామములను గూర్చి, ఆయనను ఉపాసించు విధివిధానములను గూర్చి, వేదవిహితములు, వేదబాహ్యములు యగు కర్మలను గూర్చి, అట్టి కర్మలను ఆచరించుట వలన కలుగు ఫలితములను గూర్చి, విద్య, అవిద్యల మధ్య గల సారూప్యతలు, వ్యత్యాసములను గూర్చి మరియు విశ్వమానవ సౌభ్రాతృత్వమును గూర్చి తెలుపును.
సృష్టిని పరిశీలించినచో అంతా ఎంతో పద్ధతిగా, క్రమబద్ధముగా, ఒక నిర్దిష్ట నియమావళికి కట్టుబడి, సమోన్నతమైన లక్ష్యముతో ముందుకు నడుచుచున్నట్లుగా కనిపించును. సాధారణముగా ఎల్లరము ప్రాపంచికముగా కొన్ని లక్ష్యములను ఏర్పరచుకొని, నిర్దిష్టమైన ప్రణాళికతో, విధివిధానములతో ఆయా లక్ష్యసాధనకై ప్రయత్నించెదము. కానీ ఇట్టి లక్ష్యములను సాధించిన పిదప, అంతులేని ఆనందము గాని, సంతృప్తి గాని లభించకపోవచ్చును. ఉదాహరణకు మన జీవిత లక్ష్యముగా ఒక సంవత్సరములో, ఒక కోటి రూపాయలు సంపాదించవలెనని నిర్ణయించుకుని, రేయింబవళ్ళు కష్టపడి ఆ లక్ష్యమును మనము ఆరు నెలల కాలములోనే పూర్తి చేయవచ్చును. కానీ ఆ విజయము కూడా మనకు పూర్తి సంతృప్తిని ఇవ్వకపోవచ్చును. ఎందుకంటే, ఈ లక్ష్యమును సాధించగానే మరింత ఎక్కువ సంపాదించాలనిగాని, లేదా మరింత తక్కువ సమయములో సంపాదించాలనిగాని అనిపించవచ్చును. ఇటువంటి సంతృప్తిని ఇవ్వలేని లక్ష్యములు, జీవిత లక్ష్యములు ఎలా కాగలవు? మరి ఎటువంటి లక్ష్యముల వలన జీవితమునందు అంతులేని ఆనందము, సాఫల్యము కలుగును? మానవుని నిజమైన జీవన లక్ష్యము ఏమిటి? సృష్టిలోని ఏ జీవరాశికి లేనటువంటి ఆలోచనాశక్తి మానవునికి మాత్రమే ఎందుకు ఇవ్వబడినది? జీవిత లక్ష్యసాధనకై ఎంత వరకు ఈ ఆలోచనాశక్తిని మానవుడు సక్రమముగా వినియోగించుచున్నాడు? ఏ విధముగా తనను సృష్టించి, ఆలోచనా శక్తిని ప్రసాదించిన వానిని గురించి తెలుసుకొనగలడు? ఏ విధముగా ఆయనకు కృతఙ్ఞతలు తెలుపగలడు?
ఇటువంటి ప్రశ్నలు సహజముగా మన అందరి మనస్సులలో ఉదయించును. ఇట్టి ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనుటకు ఆధ్యాత్మిక గ్రంథముల యొక్క ఆవశ్యకత ఎంతో గలదు. మానవ జీవితమునకు సరియైన దిశానిర్దేశనము చేయగల ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథములు అపౌరుషేయములైన (పరమేశ్వరకృతములగు) వేదములేనని ఎందరో మహాపురుషులు ప్రవచించినారు. ఆర్యసమాజ స్థాపకులు, గొప్ప సామాజిక సంస్కర్త అయిన శ్రీ స్వామి దయానంద సరస్వతి గారు, వేదములు సమస్త సత్య విద్యలకు మూలమని, వాటిని చదువుట, చదివించుట ప్రతి మానవుని యొక్క ప్రాథమిక విధియని తెలిపారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా వేదములనే ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథములుగా నిర్ధారించారు.
వేదమనే పదము “విద్” అను మూల ధాతువు నుండి ఉద్భవించినది. “విద్” అనగా తెలుసుకొనుట. వేదములు అనగా ఎల్ల మానవులు విధిగా తెలుసుకొనవలసిన గ్రంథములని అర్థము. వేదములయందు ఋగ్వేదము, అథర్వ వేదము, యజుర్వేదము మరియు సామవేదమను నాలుగు భాగములు కలవు. వేదముల యొక్క నిజమైన అర్థమును వేదాంగములననుసరించి మాత్రమే తెలుసుకొనవలెను. వేదాంగముల యందు నిరుక్తము, ఛన్దస్సు, శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము, కల్పము అను ఆరు భాగములు కలవు.
ఈ అధ్యాయమునందలి ప్రతి శ్లోకమును వేదాంగముల ననుసరించి కూలంకుషంగా వివరించాను. ఇంతటి అద్భుతమైన అధ్యాయమును పాఠకుల ముందుంచు అవకాశమును కల్పించిన పరమేశ్వరునికి, అత్యంత వినమ్రతతో కృతఙ్ఞతలు తెలుపుకొనుచున్నాను. ఈ బ్రాహ్మణ్యమును ఎల్లరూ అర్థము చేసుకొని, ఆచరించి, పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని ఆశించుచున్నాను. నేను చేయు ఇట్టి ప్రయత్నమును పరమేశ్వరుడు అనుగ్రహించి, అందరికీ చేరువ చేయవలెనని ప్రార్థించుచున్నాను.
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః !
